- నాసిరకం బొగ్గుతో జెన్కోకు రూ.2900 కోట్ల నష్టం
- 40 లక్షల టన్నుల బొగ్గుంటే విద్యుత్ కొరత ఎందుకుంది?
- రాష్ట్రంలో 1980ల నాటి పరిస్థితులొచ్చాయని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనా వైఫల్యం, విద్యుత్ నిర్వహణలో లోపాలు, సింగరేణి-జెన్‌కో మధ్య ఆర్థిక వ్యవహారాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతతో ఉత్పత్తి పడిపోతున్నదని, జల విద్యుత్ కేంద్రాలు కూడా నీటి లభ్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సింగరేణి బొగ్గు సరఫరా కూడా కారణమన్నారు. జెన్‌కోకు నాణ్యమైన బొగ్గు అందించాల్సిన సింగరేణి.. తక్కువ నాణ్యత కలిగిన జీ13, జీ14 గ్రేడ్ బొగ్గును సరఫరా చేస్తున్నదని విమర్శించారు. నాసిరకం బొగ్గు వినియోగించడం వల్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గడంతో రూ.2,900 కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. సింగరేణి నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, రూ.1,600 కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెప్పారు.
బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంటే థర్మల్ పవర్ ప్లాంట్లు ఎందుకు నిలిచిపోతున్నాయని ప్రశ్నించారు. సింగరేణికి జెన్‌కో రూ.52 వేల కోట్లు బకాయి పడిందని, ఆ చెల్లింపులు కాకపోవడంతోనే నాసిరకం బొగ్గును సప్లై చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ‘80స్ ట్రెండ్’ నడుస్తున్న సమయంలో తెలంగాణలో మాత్రం 1980ల నాటి విద్యుత్ పరిస్థితులు తిరిగి వచ్చాయన్నారు. అప్పట్లో రైతులు విద్యుత్ కోసం పడిన ఇబ్బందులు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయన్నారు.
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి, క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో రైతులకు ఆరు గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ల వద్ద రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. విద్యుత్ కోతల ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కావడం లేదని, పరిశ్రమలు కూడా ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులపై ఆధారపడుతున్నాయని చెప్పారు.
కొంతమంది పారిశ్రామికవేత్తలు తమ విద్యుత్ అవసరాల్లో సుమారు 30 శాతం వరకు జనరేటర్ల ద్వారా సమకూర్చుకుంటున్నామని చెప్పినట్టు తెలిపారు. రానున్న వేసవిలో పరిస్థితి మరింత తీవ్రమైతే తాగునీరు, యాసంగి పంటలు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం ఏం ప్రణాళికతో ముందుకెళ్తున్నదో చెప్పాలని ప్రశ్నించారు.
సింగరేణితో ఫుట్‌బాల్ ఆడుతున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థతో ఫుట్‌బాల్ ఆడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి కార్మికులు, రైతులు, పరిశ్రమలు, ఐటీ పార్కుల భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి రావద్దని అన్నారు. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ల పేరుతో సింగరేణిలో అక్రమాలకు పాల్పడ్డారని, సోలార్ పవర్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. 2023–24లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు ఉండగా.. 2025–26లో 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనూ రైతులు విద్యుత్ సమస్యపై రోడ్డెక్కారని చెప్పారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తమ పార్టీ నుంచి ఆరు బృందాలు విద్యుత్ ప్లాంట్ల పరిశీలనకు వెళ్తాయన్నారు. బొగ్గు ఉత్పత్తి ఎంత? నిల్వలు ఎంత? ప్లాంట్లకు ఎంత బొగ్గు వస్తున్నది? ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది? ప్లాంట్ల సామర్థ్యం ఎంత? ఎందుకు యూనిట్లు నిలిచిపోయాయి? సింగరేణి-జెన్‌కో మధ్య బకాయిల పరిస్థితి ఏమిటి? తదితర అంశాలను పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచుతామని కేటీఆర్ తెలిపారు.
